ప్రతిభకు పట్టం.. ఈఎల్సీ పోటీల్లో సింగన్నగూడ విద్యార్థుల విజయకేతనం!

మండల స్థాయిలో నాలుగు బహుమతులు కైవసం

క్విజ్, వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల అసాధారణ ప్రతిభ

విజేతలను అభినందించిన అధికారులు, ఉపాధ్యాయ బృందం

ప్రతిపక్షం, నంగునూరు/ములుగు, నవంబరు 12: చదువుతో పాటు సామాజిక స్పృహ, ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహనలోనూ సింగన్నగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమదైన ప్రతిభను చాటుకున్నారు. మండల స్థాయిలో నిర్వహించిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్సీ) క్విజ్, వ్యాసరచన పోటీల్లో నాలుగు బహుమతులను కైవసం చేసుకుని పాఠశాల కీర్తిని చాటారు.ఒకే పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు బహుమతులు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ములుగు మండల స్థాయిలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సింగన్నగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. క్విజ్ పోటీల్లో పదో తరగతికి చెందిన ఆర్.అర్చన ప్రథమ బహుమతి సాధించగా, డి.అలకనంద ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. వ్యాసరచన పోటీల్లో జి. నందిని ప్రథమ బహుమతి, ఆర్. అనన్య ద్వితీయ బహుమతి సాధించి విజయ పరంపరను కొనసాగించారు.

ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో చైతన్యం

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడం, ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు, ఓటు హక్కు ప్రాధాన్యత వంటి అంశాలపై చైతన్యం కల్పించడంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల విజయంతో పాఠశాలలో హర్షాతిరేకాలు

మండల విద్యాధికారి ఉదయభాస్కర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు కవిత, విద్యాధర్ రెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు డా.దేవులపల్లి పరశురాములు, ఉపాధ్యాయులు లక్ష్మి, శోభారాణి, శైలజ తదితరులు విజేతలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.మండల స్థాయిలో నాలుగు బహుమతులు సాధించడం పట్ల పాఠశాల హెచ్‌ఎం రహీమ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు సవితాంజని, డా. దేవులపల్లి పరశురాములు తదితర ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందిస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

Latest News