ఈ నెల 5న ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్.. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు!

ప్రతిపక్షం, నవంబర్ 02: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన పేరెంట్స్ మీటింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, చదువులో వారి సామర్థ్యాలు, పరీక్షల్లో సాధించిన ఫలితాలపై తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులతో పంచుకోనున్నారు. విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎంతవరకు ప్రతిభ కనబరిచారు? ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారు? వారి అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించనున్నారు.

ఈ సమావేశంలో భాగంగా విద్యార్థుల విద్యా స్థాయిని అంచనా వేసేందుకు రూపొందించిన ‘హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను’ కూడా అదే రోజు తల్లిదండ్రులకు అందజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నిర్ణయించింది. కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నేర్చుకునే సామర్థ్యం, వివిధ అంశాల్లో వారి పురోగతిని తల్లిదండ్రులకు వివరించేందుకు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఉపయోగపడనున్నాయి. విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి వాటికి అనుగుణంగా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వనున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 5వ తేదీలోపు ఎస్ఏ-1 పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రోగ్రెస్ కార్డుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని వివరాలను పూర్తి చేయాలని సూచించింది. తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరై తమ పిల్లల చదువుపై ఉపాధ్యాయులతో చర్చించాలని విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచడం ద్వారా విద్యార్థుల అభ్యసన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

Related News

Latest News