ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాణహిత నదిపై నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఇప్పించేలా కేంద్రం చొరవ చూపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సమావేశమైన సీఎం, ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, పరిపాలనా అంశాలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను ఇటీవల లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ లేఖపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జల్‌శక్తి శాఖకు పంపిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద గతంలో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం కుదిరిందని సీఎం తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలంటే బ్యారేజీ ఎత్తును 150 నుంచి 152 మీటర్లకు పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ (CWPRS) సమగ్ర అధ్యయనం నిర్వహించిందని, ఆ నివేదిక ప్రకారం 148 మీటర్లు లేదా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావంలో పెద్దగా తేడా ఉండదని వెల్లడించారు.
ముంపు ప్రాంతంలో దాదాపు 50 శాతం నదీగర్భంలోనే పరిమితమవుతుందని అధ్యయనం స్పష్టం చేసిందని సీఎం పేర్కొన్నారు. కాబట్టి ముంపు భయాలను పక్కనబెట్టి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని మహారాష్ట్రను ఒప్పించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యం కాదని, ఫలితంగా భారీ స్థాయిలో విద్యుత్ వినియోగంతో నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఏర్పడుతుందని సీఎం వివరించారు. అదే 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే సహజ గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేయవచ్చని చెప్పారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి వసతులను విస్తరించడంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. రైతుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరుగుతుందని వివరించారు.
సీఎం విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ అంశంపై లేఖ అందినట్లు తెలిపారు. ముందుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సాంకేతిక అంశాలపై చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, డాక్టర్ కడియం కావ్య, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ. శ్రీధర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంలో కేంద్రం చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం సాధిస్తే, తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కీలక సాగునీటి ప్రాజెక్టుకు మార్గం సుగమం కానుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


















