ప్రతిపక్షం, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రాజమండ్రి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఘటనకు ముందు నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య ఫోన్లలోని వాట్సాప్ సందేశాలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తొలగించిన సందేశాలను తిరిగి రాబట్టేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.
ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే డిలీట్ చేసిన సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడారు? ఎలాంటి సందేశాలు పంపారు? ఏదైనా ఒత్తిడి లేదా బెదిరింపులు ఎదురయ్యాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న సాధిక్ ఖాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పది పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. సాధిక్ ఖాన్ కదలికలను గుర్తించేందుకు అతడి ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
అతడితో నూకరాజు కుటుంబానికి ఉన్న సంబంధాలు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, ఫోన్ సంభాషణలు తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక, కాల్ డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.





























