ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణలో ప్రత్యేక ఓటరు ధృవీకరణ (ఎన్యూమరేషన్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 10తో ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల సేకరణ, డిజిటలైజేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల యంత్రాంగం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 77.66 శాతం మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. అయితే హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 60 లక్షలకు పైగా ఓట్లు తొలగే అవకాశం ఉందని సమాచారం. ఇందులో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ నమోదైన చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, చిరునామాలు మార్చుకున్నవారు, వివరాలు ధృవీకరించని వారు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అదనంగా, డూప్లికేట్ ఓట్లు మరియు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు నమోదైన వారి సంఖ్య కలిపి మరో 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తరహా నమోదులను గుర్తించి నిబంధనల ప్రకారం జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.
ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ ప్రత్యేక ధృవీకరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తుది జాబితా విడుదలకు ముందు వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్లు, అభ్యర్థనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వంతో సిద్ధమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

















