ప్రతిపక్షం, ఆగస్టు 16, ములుగు: ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
ములుగు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సమ్మక్క–సారలమ్మ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. వేయి స్తంభాల గుడితో పోటీ పడే స్థాయిలో వనదేవతల ఆలయాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మేడారం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
జంపన్నవాగు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ములుగు ప్రాంతానికి జీవనాడిగా ఉన్న జంపన్నవాగును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలో పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. మంత్రి సీతక్క చేసిన సూచనల మేరకు ఈ పనులను త్వరలోనే చేపడతామని తెలిపారు. మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కూడా అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ములుగు ప్రాంత ఆదివాసీ ప్రజలు కష్టానికి మారుపేరని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే సాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి త్వరలో సమీక్ష నిర్వహించి అవసరమైన నిధులు మంజూరు చేస్తారని చెప్పారు.
యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్య, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ములుగు ప్రాంతంలో యంగ్ ఇండియా సమీకృత నివాస పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో సాంకేతిక విద్యకు సంబంధించి నిరుద్యోగ యువతకు ఏం అవసరమైతే అది అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు బలమైన పునాది వేయడంతో పాటు ఆ తర్వాత విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలరని చెప్పారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల విస్తరణ, విద్యా సంస్థల బలోపేతం ద్వారా ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
“మీరు ప్రభుత్వానికి అండగా నిలబడండి. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత మాది. పాడి, పంటలతో తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దుదాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.




































