- సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
- కరీంనగర్ నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 29: నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ భవనం పూల అలంకరణ, పరిసరాల పరిశుభ్రత, పార్కింగ్, భద్రత, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌ను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.రేపు నూతన కలెక్టరేట్ భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలెక్టర్‌ను వారి ఛాంబర్లోని సీట్లో ఆసీనులను చేసి, నూతన కలెక్టరేట్ భవనంలో అధికారికంగా పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సమగ్ర అభివృద్ధిపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అర్బన్ డెవలప్మెంట్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తారు.
కరీంనగర్ అభివృద్ధికి ప్రజాపాలన కు ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి పొన్నం ప్రభాకర్*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల ఆశయాలకు తగిన ప్రాధాన్యత దక్కలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులు, సంక్షేమం తదితర రంగాల్లో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.గత 10 సంవత్సరాలుగా శాతవాహన యూనివర్సిటీ కి కనీసం వీసీ నీ కూడా నియమించలేదు. అభివృద్ధితో పాటు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యా అవకాశాలను పెంచామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు లేకుండా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితిని పెంచి మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులైన వారికి రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా, రైతులకు బోనస్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నిరుద్యోగులకు 70 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, గౌరవెల్లి, కలికోట సూరంపేట తదితర ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.250 కోట్లు కేటాయించామని, మిడ్ మానేరు ప్రాజెక్టు బాధితుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి
మానేరు రివర్ ఫ్రంట్, డంపింగ్ యార్డ్, కరీంనగర్ రింగ్ రోడ్డు తదితర కీలక అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ, పారిశ్రామిక, విద్యా, వైద్య రంగాల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు.కరీంనగర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వెళ్లనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.నేతన్నల సమస్యల పరిష్కారం, పాత బకాయిల చెల్లింపుతో పాటు చేనేత, పవర్లూమ్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను ముఖ్యమంత్రి తన పర్యటన ద్వారా కల్పించనున్నారు.ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.






























