ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా…
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ 22: పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హత్య చేసిన కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, గురువారం వెల్లడించారు. కేసులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జెల్లా రాజారామ్ గౌడ్, యాడరం నాగరాజు గౌడ్ కుటుంబాల మధ్య పాత కక్షల కారణంగా తరచూ ఘర్షణలు చోటుచేసుకునేవి. ఈ నేపథ్యంలో 2020 మే 20న ఉదయం 6.30 గంటల సమయంలో రాజారామ్ గౌడ్ కుమారుడు నర్సింలు గౌడ్ (28) గ్రామ శివారులోని బీడు భూమిలో తీవ్ర గాయాలతో కనిపించాడు. అతడిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిజాంపేట పోలీసులు క్రైమ్ నంబర్ 42/2020గా హత్య కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేయగా, అప్పటి దర్యాప్తు అధికారి రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య న్యాయస్థానంలో వాదనలు వినిపించగా, పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన తెలిపారు నిందితులు. యాడరం నాగరాజు గౌడ్.బంధారం లక్ష్మీనారాయణ గౌడ్.బంధారం నాగరాజు గౌడ్. బంధారం నవీన్ గౌడ్.బంధారం గణేష్ గౌడ్.యాడరం శేఖర్ గౌడ్. యాడరం రమేష్ గౌడ్ లకు శిక్ష పడ్డట్లు ఎస్పీ తెలిపారు.ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య, కోర్టు లైజన్ అధికారి ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్, నిజాంపేట సీడీఓ మహేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.





























