జిల్లాలో వడ్డీ, చిట్టీ నిర్వాహకుల ఇళ్లలో జిల్లా పోలీసుల మెరుపు దాడులు

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 57 మంది అధిక వడ్డీ, చిట్టీ వ్యాపారుల ఇళ్లలో విస్తృత తనిఖీలు

16 కేసుల నమోదు, 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్ బుక్స్ స్వాధీనం – జిల్లా ఎస్పీ

అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్

ప్రతిపక్షం ప్రతినిధి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, నవంబర్27: ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షపాతం లోటు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులు మరియు ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీ నిర్వాహకులు రైతులు మరియు అమాయక ప్రజలకు అధిక వడ్డీలకు డబ్బులు అప్పుగా ఇచ్చి, వారిని ఆర్థికంగా వేధిస్తూ, చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ప్రజల ఫిర్యాదులు, విజ్ఞప్తుల మేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా 57 మంది అధిక వడ్డీ, చిట్టీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించారు.

ఈరోజు ఉదయం నుంచి ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 57 మంది అధిక వడ్డీ, చిట్టీ వ్యాపారులకు సంబంధించిన ఇళ్లలో జిల్లా పోలీసులు ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో వడ్డీ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, చిట్టీ రికార్డులు, ప్రామిసరీ నోట్లు, చెక్ బుక్స్ మరియు ఇతర కీలక డాక్యుమెంట్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేసి, 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. అధిక వడ్డీ, చిట్టీ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను, రైతులను ఆర్థికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వడ్డీలు వసూలు చేస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు అధిక వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురైతే భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని, బాధితులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా ప్రజలకు విజ్ఞప్తి : మీ ప్రాంతాల్లో అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీ నిర్వాహకుల కార్యకలాపాలు లేదా ప్రజలను వేధించే ఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని జిల్లా పోలీస్ శాఖ భరోసా ఇస్తోంది.

ప్రజల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించడమే లక్ష్యంగా అధిక వడ్డీ, చిట్టీ నిర్వాహకులపై పోలీసుల నిఘా, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ స్పష్టం చేశారు.ఈ ప్రత్యేక తనిఖీల కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, జిల్లా పోలీసు అధికారులు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News