డీలిమిటేషన్‌ బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం.

ప్రతిపక్షం, నవంబర్ 27: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే డీలిమిటేషన్‌ బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ప్రతిపాదన ప్రకారం అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్య కంటే 50 శాతం పెంచనున్నారు. పెరిగిన స్థానాల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య స్థానాల నిష్పత్తిని కొనసాగిస్తూనే, అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం పెంపు వర్తింపజేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ప్రభావం పడకుండా చూడాలనే అంశం కూడా ఈ ప్రతిపాదనలో కీలకంగా ఉన్నట్లు సమాచారం.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంతో పాటు డీలిమిటేషన్‌ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సంబంధిత రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అయితే క్యాబినెట్‌ ఆమోదం లభించినంత మాత్రాన బిల్లు చట్టంగా మారినట్లు కాదు. పార్లమెంట్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించడంపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ బిల్లులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉండటంతో రానున్న పార్లమెంట్‌ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

Related News

Latest News