ప్రేమించడమే పాపమా?.. పరువు పేరుతో కూతురిని కడతేర్చిన తండ్రి

ప్రతిపక్షం, నవంబర్ 26: కుటుంబ పరువు పోతుందనే భావనతో కన్నకూతురినే హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సిన యువతి ప్రేమ వ్యవహారం బయటపడటంతో ఆగ్రహానికి గురైన తండ్రి, ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన మరణంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు తండ్రి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సుమిత్ర దంపతులకు 18 ఏళ్ల కుమార్తె కళ్యాణి ఉంది. ఇటీవల కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధం ఖరారు చేశారు. నార్నూర్‌కు చెందిన ఓ యువకుడితో ఈ నెల 25న నిశ్చితార్థం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంట్లో పెళ్లి సందడి నెలకొనగా, బంధువులు, కుటుంబ సభ్యులు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సంతోషకరమైన వాతావరణం కొద్ది రోజుల్లోనే విషాదంగా మారింది.

ఈ నెల 23న కళ్యాణి ప్రవర్తనలో మార్పును గమనించిన తండ్రి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. అదే రోజు ఉదయం తల్లిదండ్రులతో పాటు కళ్యాణి, మరో బాలుడు పత్తి ఏరేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కడుపునొప్పిగా ఉందని చెప్పి కళ్యాణి ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్న అనంతరం ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలో తనకు మేనత్త కుమారుడితో ప్రేమ సంబంధం ఉన్నట్లు కళ్యాణి వెల్లడించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

కూతురి ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించలేకపోయిన కైలాస్ కుటుంబ పరువు పోతుందనే భావనతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న వేళ కళ్యాణి గదిలోకి వెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరివేసుకున్నట్లుగా ఏర్పాటు చేసి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రలేచిన కళ్యాణి తల్లి, కుమార్తె విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో తీవ్రంగా రోదించింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు ఇంటికి చేరుకున్నారు. తొలుత కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భావించారు. అయితే యువతి మరణించిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం పలు అనుమానాలకు దారితీసింది. పెళ్లి నిశ్చయమైన యువతి ఆకస్మిక మరణం, అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై గ్రామంలో చర్చ మొదలైంది. ఈ పరిణామాలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో భాగంగా తండ్రి కైలాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మేనత్త కుమారుడితో కుమార్తెకు ప్రేమ సంబంధం ఉందని తెలుసుకున్నానని, కుటుంబ పరువు పోతుందనే కారణంతో తానే ఆమెను హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. హత్య అనంతరం ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కూతురి నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఉమ్రి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక యువతి తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ గౌరవం, పరువు పేరుతో హింసకు పాల్పడటం ఎంతటి విషాద పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సిన ఇంట్లో ఇప్పుడు కన్నీళ్లు, విషాదం మిగిలాయి.

Related News

Latest News