రాజ్యాంగంపై కేంద్రం కుట్రలను తిప్పికొడతాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 26: రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను తిప్పికొడతామని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన సంవిధాన్‌ రక్షా ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించాలనే లక్ష్యంతో రూపొందించబడిందని పేర్కొన్నారు. ప్రజలకు హక్కులు, స్వేచ్ఛ, రక్షణ కల్పించడంతోపాటు పాలకులను ఎన్నుకునే అధికారాన్ని కూడా రాజ్యాంగమే ప్రజలకు అందించిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన ప్రజల చేతుల్లో ఉండేలా రాజ్యాంగం మార్గనిర్దేశం చేస్తోందని వివరించారు. అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని సీఎం ఆరోపించారు. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రలను కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొంటుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యం సాధించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు సహా అణగారిన వర్గాలకు ఓటు హక్కు ఉండకూడదన్నదే బీజేపీ లక్ష్యమని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భాష, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనే విషయాన్ని తమకు అనుకూలంగా నిర్ణయించుకోవాలని బీజేపీ చూస్తోందని అన్నారు.

ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం కూడా బీజేపీకి సహకరిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు ఉండాలని, ఆ హక్కును ఎవరూ హరించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారని చెప్పారు. ఈ పోరాటాన్ని కేవలం కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పోరాటంగా చూడకూడదని, దేశ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, భవిష్యత్తు, జీవన మనుగడకు సంబంధించిన ఉద్యమంగా భావించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతోపాటు ప్రజాస్వామ్య విలువలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Related News

Latest News