పెద్దన్నే ముఖ్యమంత్రి అవుతారు.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రతిపక్షం, నవంబర్ 24: పంజాబ్ రాజకీయాల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మరోసారి పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘పెద్దన్నే ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు పెద్దన్న అయితే వారికే ఆ పదవి దక్కుతుంది’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా పెద్దన్న ఎవరనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో బీజేపీ, అకాలీదళ్‌లలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములయ్యాయి. అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన అనంతరం పొత్తుపై ప్రకటన వెలువడింది. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే సీట్ల పంపకాలు, ముఖ్యమంత్రి పదవిపై ఇరు పార్టీల మధ్య ఎలాంటి తుది నిర్ణయం కుదిరిందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

బీజేపీ, అకాలీదళ్ మధ్య కుదిరిన ఈ పొత్తు కేవలం రాజకీయ కలయిక మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ-సిక్కు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య ఐక్యత, పరస్పర గౌరవాన్ని ఈ బంధం ప్రతిబింబిస్తుందని తెలిపారు. గతంలోనూ రెండు పార్టీలు కలిసి అనేక ఎన్నికల్లో పోటీ చేశాయని గుర్తుచేశారు. మరోవైపు పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను ప్రస్తావిస్తూ డ్రగ్స్ నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడటంతో పాటు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. తాజా పొత్తుతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడగా, ముఖ్యమంత్రి పదవి విషయంలో అమిత్ షా చేసిన ‘పెద్దన్న’ వ్యాఖ్యలపై రెండు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News