పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు రేషన్ కార్డులు అందించాం
ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి
- మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబర్ 16: రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తుల పెంపు, సంపద కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. సిద్ధి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. దళితబంధు పథకం విషయంలోనూ అనేకమందికి అన్యాయం జరిగిందని విమర్శించారు. దళితుల భూములను తీసుకుని వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకున్న చరిత్ర గత పాలకులదని మండిపడ్డారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందించిందని హనుమంతరావు తెలిపారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీపై వంటగ్యాస్, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని వివరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు.
19న ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి
ఈ నెల 19న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిద్ధిపేటకు రానున్న నేపథ్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు సూచించారు.ఈ సభలో ముఖ్యమంత్రి ఇంటింటికీ ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా ద్వారా భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ప్రజల జీవితాలకు భద్రత కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో సభాధ్యక్షుడిగా సాకి ఆనంద్ వ్యవహరించారు. చేనేత కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, రవాణా శాఖ సలహా మండలి సభ్యుడు సూర్యవర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు సాకి బాలలక్ష్మి, సాకి ఆనంద్, ఆలకుంట మహేందర్, రియాజ్, ఎల్లం యాదవ్, బుచ్చిరెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తప్పట శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక, మాజీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిద్ధిపేట పట్టణంతో పాటు చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు హాజరయ్యారు.





























