అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం వహించే పోలీసులపై చర్యలు తీసుకోవాలి
అక్టోబర్ 30న జిల్లావ్యాప్తంగా పౌరహక్కుల దినం నిర్వహిస్తాం: అదనపు కలెక్టర్ నగేష్ హామీ
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 26: జిల్లాలో దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం అదనపు కలెక్టర్ మెంచు నగేష్‌కు కేవీపీఎస్ ప్రతినిధులు ఎం. అడివయ్య, కె. మల్లేశం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నవాబుపేట, కుచారం, కోనాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో దళితులపై దాడులు జరిగినట్లు ఆరోపించారు. ఘటనలు జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని, బాధితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేశారని విమర్శించారు.
నవాబుపేటలో అక్టోబర్ 18న దళితులు ఫిర్యాదు చేసినప్పటికీ 25వ తేదీ వరకు కేసు నమోదు చేయలేదని, నిందితుల ఫిర్యాదుపై మాత్రం 24 గంటల్లో కేసు నమోదు చేశారని ఆరోపించారు.నవాబుపేట, కోనాయిపల్లి గ్రామాల్లో దళితులపై దాడులకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అమలుకు నోచుకోని పౌరహక్కుల దినం
జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రతి నెల 30న పోలీసులు, రెవెన్యూ, ఎంపీడీవో, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా పౌరహక్కుల దినం నిర్వహించాలని అడివయ్య పేర్కొన్నారు. అయితే మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై ప్రశ్నించారు.
అక్టోబర్ 30న పౌరహక్కుల దినం నిర్వహిస్తాం
దళితులపై దాడుల ఘటనలపై తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారులతో విచారణ జరిపిస్తామని అదనపు కలెక్టర్ మెంచు నగేష్ హామీ ఇచ్చారు. నాలుగు గ్రామాల్లో జరిగిన ఘటనలపై విచారణ చేపట్టాలని సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు. అక్టోబర్ 30న జిల్లాలోని అన్ని మండలాల్లో పౌరహక్కుల దినం నిర్వహిస్తామని తెలిపారు. కులవివక్షకు పాల్పడటం, దళితులపై దాడులు చేయడం చట్టరీత్యా నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




























