*బతుకమ్మ బహుమతులు వేలల్లో.. ప్రచార సభలకు కోట్లల్లో!
*రాచకొండ ఉత్సవ సమితి ఆర్భాటం వెనుక అసలు లెక్కేంది?
*సేవ చేయడానికా.. రాజకీయ పునాదులు వేసుకోవడానికా?
*బతుకమ్మకు అగౌరవం.. భాస్కర్ మొఖాన్ని అతికించి ఆటలా..!
ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 25: మునుగోడు ప్రజల సమస్యలు ఎన్నో.. వాటికి పరిష్కారాలు మాత్రం అంతంతే! ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ బాధితుల వెతలు, సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు, శివన్నగూడెం రిజర్వాయర్ కోసం ప్రజల డిమాండ్లు.. ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరోవైపు సొంత పేరుతో కొత్త రాజకీయ ముఖాల పరిచయ కార్యక్రమాలు జోరుందుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య భాస్కర్ ఫౌండేషన్, రాచకొండ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల తీరు ఇప్పుడు ఇదే చర్చకు కేంద్రబిందువైంది. బతుకమ్మ బహుమతుల నుంచి భారీ సభల వరకు సాగుతున్న ఈ వ్యవహారంలో ప్రజలకు దక్కుతున్న ప్రయోజనం ఎంత? వ్యక్తిగత ప్రచారానికే దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? అన్న ప్రశ్నలు మునుగోడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
*బహుమతులు వేలల్లో.. సభకు మాత్రం కోట్ల ఖర్చా?
బతుకమ్మ సంబరాల పేరుతో మండలాల వారీగా పంపిణీ, ఇదే పేరుతో బహుమతుల ప్రకటనలు ఒకవైపు అయితే.. గట్టుప్పల్ మండలంలో రాచకొండ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించడం మరోవైపు. ఈ కార్యక్రమానికి సుమారు రెండు కోట్ల వరకు ఖర్చయిందనే అంచనాలు ప్రచారంలో ఉన్నాయి..! ఈ మొత్తం అధికారిక లెక్కల్లో నిరూపణ కావాల్సి ఉన్నప్పటికీ, బహుమతుల కోసం వెచ్చించిన మొత్తానికి, సభా నిర్వహణ కోసం చేసిన ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసంపై మాత్రం ప్రజల్లో చర్చ తప్పడం లేదు.
*ఎవరీ ఈఎల్వి భాస్కర్? సేవ పేరుతో రాజకీయ రంగ ప్రవేశమా?
ఈఎల్వి ఫౌండేషన్ పేరుతో ఈఎల్వి భాస్కర్ చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు మునుగోడులో రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. బతుకమ్మ సంబరాలు, భారీ సభలు, గ్రామాల్లో ప్రచారం, శివన్నగూడెం రిజర్వాయర్ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడం.. ఇలా ఒకదాని వెంట మరొక కార్యక్రమంతో ఆయన పేరు ప్రజల్లోకి వెళ్తోంది.
*టీఆర్ఎస్ మద్దతు కోసమా? కాంగ్రెస్ పై విమర్శల వెనుక రాజకీయ లెక్కలున్నాయా?
శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న భాస్కర్ రాజకీయ వైఖరిపై చర్చ జరుగుతోంది.
*ప్రచారానికి పెట్టే ఖర్చుతో ప్రజలకు శాశ్వత మేలు చేయలేరా?
మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య ఉంది. పేద కుటుంబాలకు వైద్య అవసరాలు ఉన్నాయి. విద్యార్థులకు సహాయం కావాలి. రైతులకు సాగునీటి కావాలి. ఇలాంటి ప్రాంతాల్లో భారీ కార్యక్రమాలు నిర్వహించే బదులు, అదే మొత్తాన్ని విద్యార్థులకు, ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు అండగా నిలవచ్చు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.





























