నీళ్లపై మాటలెందుకు.. చేతల్లో చూపించు!

తెలంగాణ నీటి హక్కులకు ద్రోహం!

తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం!

17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు?

కాంగ్రెస్‌, బీజేపీలపై హరీశ్‌ ఫైర్‌

నీళ్ల విషయంలో రేవంత్ నిర్లక్ష్యం

కన్నెపల్లి, దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల వద్దకు వెళ్దాం.. నిర్లక్ష్యాన్ని నిరూపిస్తా

సీఎం రేవంత్‌కు హరీశ్‌ రావు సవాల్‌

తెలంగాణ నీటి హక్కులపై 17 మంది ఎంపీలు మౌనం వీడాలి

లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదు

కత్తి ఆంధ్రోడిదైనా.. పొడిచేది తెలంగాణోడే’.

ఉద్యమ కాలం నాటి మాటలను గుర్తు చేసి ప్రభుత్వంపై విమర్శలు

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, అక్టోబరు 17: తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు విమర్శించారు. పోలవరం–బనకచర్ల అంశంలో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్‌ కు తాకట్టు పెట్టే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే తమ లక్ష్యమని శనివారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పదేపదే చెప్పిన ‘కత్తి ఆంధ్రోడిదైనా.. పొడిచేది మన తెలంగాణోడే’ అన్న మాటలను ఈ సందర్భంగా హరీశ్‌ రావు గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన వారే రాష్ట్ర రైతుల వ్యవసాయాన్ని దెబ్బతీసేలా, పరాయి ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలిగితే తెలంగాణ సమాజం మరోసారి మేల్కొని తన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

నీళ్లను కొనలేమని చెప్పడమేనా బాధ్యత?

‘నీళ్లను కొనలేం’ అంటూ పెద్దపెద్ద మాటలు చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్రానికి అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌ రావు ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తి పోసి రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీటి విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా వివరిస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాజెక్టుల వద్దకు వస్తే, ప్రభుత్వ పనితీరును నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. కన్నెపల్లి, దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలిద్దామని ముఖ్యమంత్రికి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు. తెలంగాణకు సాగునీటి ప్రయోజనాలు దక్కాల్సిన సమయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పోలవరం–బనకచర్లపై ప్రభుత్వానికి అవగాహన ఉందా?

పోలవరం బనకచర్ల అంశంలో అసలు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? లేక అన్నీ తెలిసి కూడా తెలియనట్లు నటిస్తోందా? అని హరీశ్‌ రావు నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన నీటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, తన రాజకీయ గురువుకు గురుదక్షిణ చెల్లిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు.రాజకీయ గురుదక్షిణగా భావిస్తున్నది తెలంగాణ జాతికి తీరని ద్రోహంగా మార కూడదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించుకున్న నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడటం సరి కాదన్నారు.

17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు?

తెలంగాణ నీటి హక్కుకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్రానికి చెందిన 17 మంది ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని హరీశ్‌ రావు నిలదీశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రయోజనాల పరి రక్షణకు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు గళమెత్తాలని కోరారు.

ప్రజా ఉద్యమానికి సిద్ధం

తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హరీశ్‌ రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణవాదులు, ప్రజలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి నీటి హక్కుల పరిరక్షణకు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News