ప్రతిపక్షం, నవంబర్ 28: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించింది. చేతిలో డబ్బులు లేక సొంత ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టలేకపోతున్న లబ్ధిదారులకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించేలా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సకాలంలో నిర్మించుకునేలా ఆర్థిక వెసులుబాటు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన డబ్బును ముందుగా రుణంగా అందించి, ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణ బిల్లులు విడుదలైన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో మొత్తం 3,45,296 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు తమ వాటా ఖర్చులు, ఇతర నిర్మాణ అవసరాలకు డబ్బులు సమకూర్చుకోలేకపోతున్నారు. దీంతో మంజూరు పత్రాలు చేతిలో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి ఆర్థిక ఇబ్బందులతో పనులు మొదలుపెట్టని కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా రుణ సదుపాయం కల్పించాలని భావిస్తోంది.
ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం తొలి విడతలో మంజూరైన ఇళ్లలో సుమారు 46,110 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గత ఏడాది సెప్టెంబరు నాటికే అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే ఆర్థిక సమస్యలు, నిర్మాణ సామగ్రి కొనుగోలు, ఇతర కుటుంబ అవసరాల కారణంగా కొంతమంది లబ్ధిదారులు పనులను మొదలుపెట్టలేకపోయారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఒకేసారి నిర్మాణ ఖర్చులు భరించడం భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో రుణాలు అందించి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ సమస్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తొలి విడతలో ఈ జిల్లాలో 47,599 ఇళ్లను మంజూరు చేయగా, అందులో 6,917 ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించే అంశంపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. లబ్ధిదారులకు అవసరమైన ఆర్థిక సాయం అందించి పునాదులు వేసేలా, నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించే విధానంలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముందుగా సంఘాల సభ్యుల నుంచి లబ్ధిదారులకు అవసరమైన మొత్తాన్ని రుణంగా ఇప్పించి, ఇంటి నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం నుంచి బిల్లులు అందిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి సంఘాలకు చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ విధానంలో కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా లబ్ధిదారులే తమ ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో నిర్మాణాలపై లబ్ధిదారులకు పూర్తి బాధ్యత, పర్యవేక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000 మంది లబ్ధిదారులకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.12.50 కోట్ల మేర రుణాలు అందించినట్లు గృహ నిర్మాణ సంస్థ డివిజనల్ మేనేజర్ శంకర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించని పేద కుటుంబాలకు రుణ సదుపాయం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్లు చొరవ చూపుతున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల పనులు నిలిచిపోకుండా మహిళా సంఘాల సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు.
మరోవైపు తొలి విడతలో మంజూరైన ఇళ్లను పూర్తి చేయడంతో పాటు రెండో విడత ఇళ్ల నిర్మాణాలను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, నిర్మాణ బిల్లుల విడుదల అంశంపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. లబ్ధిదారులకు విడతలవారీగా అందాల్సిన ఆర్థిక సాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేదల సొంత ఇంటి కల మధ్యలోనే ఆగిపోకుండా మహిళా సంఘాల రుణ వ్యవస్థను ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించని వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.



























