ప్రతిపక్షం, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మరోసారి ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికి నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని కారణాలతో ఆ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి మహిళలకు ఉచితంగా చీరలను అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఈసారి ఇందిరమ్మ చీరల రంగు, డిజైన్లలో ప్రత్యేకత చూపించారు. గతంలో పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేయగా, ఈసారి ఎరుపు రంగు జరీ అంచుతో కూడిన చిలకపచ్చ రంగు చీరలను ఎంపిక చేశారు. మహిళలకు ఆకర్షణీయంగా ఉండేలా కొత్త డిజైన్లతో వీటిని రూపొందించారు. మొత్తం కోటి చీరల్లో 95 లక్షల చీరలు 6.30 మీటర్ల పొడవుతో పాలిస్టర్ వస్త్రంతో తయారు చేయగా, మరో 5 లక్షల చీరలను 9 మీటర్ల పొడవుతో పాలీకాటన్ వస్త్రంతో రూపొందించారు. రాష్ట్రంలోని మహిళల అభిరుచులకు అనుగుణంగా చీరలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది ఉచిత చీరల పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.334 కోట్లను కేటాయించింది. చీరల తయారీ బాధ్యతలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులకు అప్పగించారు. మహిళలకు ఉచితంగా చీరలు అందించడంతో పాటు స్థానిక చేనేత, నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చీరల తయారీ ద్వారా రాష్ట్రంలోని నేత కార్మికులకు పని కల్పించడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితికి కొంతమేర అండగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ ఈ చీరల పంపిణీకి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో ఆయా జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు పంపిణీ బాధ్యతలు నిర్వహించనున్నారు. పంపిణీలో ఎలాంటి గందరగోళం లేకుండా అర్హులైన మహిళలందరికీ చీరలు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
చీరల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను కూడా సిద్ధం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని అర్హులైన మహిళలకు వారం రోజుల పాటు చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళలు పంపిణీ కేంద్రాల వద్ద లేదా ఇళ్ల వద్దకు వచ్చే సంబంధిత పంచాయతీ అధికారులకు తమ ఆధార్ గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు ప్రత్యేక యాప్ ద్వారా మహిళల ఫొటో తీసి, వివరాలను ధ్రువీకరించిన తర్వాత చీరలను అందజేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఒకే మహిళకు రెండుసార్లు చీరలు పంపిణీ కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేరేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 26న అచ్చంపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కొత్త డిజైన్లతో కూడిన ఇందిరమ్మ చీరలు అందనున్నాయి.



























