ప్రతిపక్షం, నవంబర్ 18: తెలంగాణలో భూముల రికార్డుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన ధరణి, భూభారతి పోర్టళ్లలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ పోర్టళ్లలోని లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి భూముల యాజమాన్య వివరాలను అక్రమంగా మార్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. తొలుత సంగారెడ్డి జిల్లా కొల్లూరులో సుమారు మూడు ఎకరాల భూమికి సంబంధించిన అక్రమ మ్యుటేషన్ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ, ఇప్పుడు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి అక్రమాలపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే రెండు విడతలుగా తొమ్మిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర ప్రాంతాల నుంచి కూడా రెవెన్యూ అధికారుల ఫిర్యాదులు అందుతుండటంతో దర్యాప్తు పరిధి విస్తరిస్తోంది.
సీఐడీ ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, అందోలు, నిజామాబాద్ జిల్లాలోని చందూర్ తదితర ప్రాంతాల్లో భూముల రికార్డుల మార్పిడికి సంబంధించి అనుమానాస్పద వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో వందల ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను అక్రమంగా మార్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాల వెనుక ఎవరున్నారు? పోర్టల్‌లోని ఏయే లోపాలను ఉపయోగించుకున్నారు? ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని భూములకు సంబంధించి భూభారతి పోర్టల్‌లో నమోదైన కొన్ని దరఖాస్తులు అధికారుల దృష్టికి రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహ్మద్ గౌస్ పేరుతో పోర్టల్‌లో రెండు దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. కూకట్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 1070/1లో ఉన్న రెండు ఎకరాల 39 గుంటలు, సర్వే నంబర్ 1070/2లోని ఒక గుంట భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండానే నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. వీటిలో మొదటి దరఖాస్తు డిజిటల్ సంతకం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు పోర్టల్‌లో కనిపిస్తుండగా, రెండో దరఖాస్తుకు ఈ ఏడాది జూన్ 22న నాలా కన్వర్షన్ ఉత్తర్వులు జారీ అయినట్లు రెవెన్యూ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
ఇదే తరహాలో పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకుండా నాలా కన్వర్షన్ కోసం వచ్చిన మరో నాలుగు దరఖాస్తులను కూడా అధికారులు గుర్తించారు. ఈ నాలుగు దరఖాస్తులు భూభారతి ఆపరేటర్ లాగిన్‌లో ‘పెండింగ్ ఫర్ క్యాప్చర్ బయోమెట్రిక్ అండ్ ఫొటో’ అనే స్థితిలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మొత్తం ఆరు దరఖాస్తులు కూకట్పల్లి తహసీల్దార్ నుంచి ముందస్తు అనుమతి లేదా సంబంధిత నివేదిక లేకుండానే ప్రాసెస్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులు పరిశీలించగా, అవి తహసీల్దార్ కార్యాలయానికి చేరలేదని తెలిసింది. దీంతో అధికారులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారంపై కూడా సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
మరోవైపు అందోలు మండలం సంగుపేటలో వెలుగుచూసిన భూ వ్యవహారం మరింత సంచలనం కలిగిస్తోంది. తెలంగాణ కేడర్‌కు చెందిన విశ్రాంత డీజీపీకి చెందిన సుమారు 4.5 ఎకరాల భూమిని ఆయనకు తెలియకుండానే ఇతరుల పేర్లపైకి అక్రమంగా మ్యుటేషన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన ఆయన భార్య సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలీ అనే వ్యక్తితో పాటు అతడి ముఠాకు చెందిన పలువురిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ధరణి, భూభారతి పోర్టళ్లలో ఆపరేటర్లుగా పనిచేసిన ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఆశ చూపించి, వారి లాగిన్లను ఉపయోగించుకుని భూముల రికార్డుల్లో అక్రమ మార్పులు చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా చందూరులోనూ భూముల అక్రమ మార్పిడికి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్కడ కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ప్రాంతంలో బయటపడుతున్న అక్రమాల వెనుక ఒకే తరహా పద్ధతులు ఉన్నాయా? పోర్టల్ నిర్వహణలోని లోపాలను ఉపయోగించుకుని భూములను ఇతరుల పేర్లపైకి మార్చారా? ఈ వ్యవహారాల్లో ప్రైవేటు ఆపరేటర్లతో పాటు మరెవరైనా సహకరించారా? అనే అంశాలను సీఐడీ పరిశీలిస్తోంది.
ధరణి, భూభారతి పోర్టళ్లలో భూముల వివరాలను మార్చే ప్రక్రియలో నిబంధనలు, అధికారుల అనుమతులు, సంబంధిత పత్రాల పరిశీలన ఎంతవరకు పాటించారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా అసలు భూ యజమానులకు తెలియకుండా రికార్డులు మారిపోయే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయన్న దానిపై దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. ఇప్పటివరకు గుర్తించిన అనుమానాస్పద దరఖాస్తులు, మ్యుటేషన్లు, లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి పూర్తి వివరాలు సేకరించే పనిలో సీఐడీ అధికారులు ఉన్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని భూ అక్రమాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.





























