తుఫాన్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రతిపక్షం, నవంబర్ 03: తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 120 నుంచి 150 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

మరోవైపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు. తుఫాన్ ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. పంటలు కోతకు వచ్చిన సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.

ప్రస్తుతం తుఫాన్ మురాసు ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related News

Latest News