- పంపిణీకి ముందే మరమ్మతులు.. కార్మికుల జేబుల నుంచే ఖర్చులు
- నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్
ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 20: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణ కోసం కొత్తగా కొనుగోలు చేసిన స్వచ్ఛ రిక్షాల నాణ్యతపై తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపణలు చేశారు. ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా కార్మికులకు రిక్షాలను పంపిణీ చేశారని, అయితే పంపిణీకి ముందే కొన్ని రిక్షాలకు టైర్లు, ట్యూబులు, తాళాలు, చైన్లు లేకపోవడంతో కార్మికులు సొంత డబ్బులతో మరమ్మతులు చేయించుకున్నారని తెలిపారు.ప్రజాధనంతో కొనుగోలు చేసిన రిక్షాలు కార్మికుల చేతుల్లోకి వెళ్లకముందే మరమ్మతులకు గురికావడం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలకు తావిస్తోందన్నారు. రిక్షాలను ప్రారంభోత్సవానికి తీసుకురావాలంటే ముందుగా రిపేర్లు చేయించుకోవాలని కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు.
రిక్షాల మరమ్మతుల ఖర్చును కార్మికుల నుంచే వసూలు చేశారన్న ఆరోపణలపై నగర పాలక సంస్థ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని రిక్షాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు నాణ్యమైన పరికరాలు అందించడం నగర పాలక సంస్థ బాధ్యత అని, ప్రజాధనం దుర్వినియోగంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హరిప్రసాద్ తెలిపారు.





























