కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపాలు
నీటిని నిల్వ చేయలేని దుస్థితి
టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి విమర్శ
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 23: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న కరువు కష్టాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలే కారణమని టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యతా లోపాల కారణంగా ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో నీటిని నిల్వ చేసి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రజాధనంతో నిర్మించిన భారీ ప్రాజెక్టు రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చ లేక పోవడం గత పాలకుల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భారీగా ఖర్చు చేసినప్పటికీ, రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందలేదని యాదగిరి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నేడు సాగునీటి సమస్యలు ఇంత తీవ్రంగా ఉండేవి కావన్నారు. ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పిన గత పాలకులు, ప్రస్తుతం రైతులు నీరు, విద్యుత్తు కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల కరెంటు కష్టాలు, నీటి ఎద్దడికి గత పాలకుల విధానాలు కూడా కారణమని ఆరోపించిన యాదగిరి, ఇప్పుడు బీ ఆర్ ఎస్ నేతలు రైతులను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సిన వారే రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని విమర్శించారు. “చంపినోడే తద్దినం పెట్టినట్లు” రైతుల సమస్యలకు కారణమైన వారే పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యతా ప్రమాణాలు, ప్రజాధనం వినియోగంపై సమగ్రంగా సమీక్షించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని యాదగిరి డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఇబ్బందులను రాజకీయ విమర్శలకు పరిమితం చేయకుండా, వారి సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని దేవులపల్లి యాదగిరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ నాయకులు ఆరె పల్లి సురేశ్ పాల్గొన్నారు.





























