డ్రగ్స్ పేరుతో మన పిల్లల భవిష్యత్తును దేశ ద్రోహులు నాశనం చేస్తున్నారు: కిషన్‌ రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 25: డ్రగ్స్‌ పేరుతో కొందరు దేశద్రోహ శక్తులు మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి జీవితాలను దెబ్బతీస్తున్నారని, తద్వారా కుటుంబాలకు, సమాజానికి వారిని దూరం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత భారత్‌ నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

డ్రగ్స్‌ వినియోగానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి నాయకత్వంలో మూడు రోజులపాటు ‘వాక్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పేరుతో ప్రత్యేక అవగాహన పాదయాత్ర ప్రారంభమైంది. నవంబర్‌ 25 నుంచి 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌, డ్రగ్స్‌ రహిత భారత్‌ లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన పెంచడం, యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

బుధవారం ఉదయం అంబర్‌పేటలోని మహంకాళి ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ వరకు యాత్ర కొనసాగనుంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. డ్రగ్స్‌ వినియోగం నగర ప్రాంతాల్లో యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు విక్టరీ వెంకటేశ్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం ద్వారా యువతలో మరింత అవగాహన పెరుగుతుందని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విక్టరీ వెంకటేశ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆయన ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటానికి సినీ ప్రముఖులు మద్దతుగా నిలవడం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత తమ చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం వంటి కీలక అంశాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ వలలోకి లాగుతున్నారని, అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించాలని, విద్యాసంస్థలు కూడా డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్‌ సమస్యను కేవలం పోలీసుల చర్యలతోనే పూర్తిగా అరికట్టలేమని, కుటుంబాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. యువతలో క్రీడలు, విద్య, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచాలని సూచించారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో కొనసాగనున్న ఈ పాదయాత్ర ద్వారా డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించి, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే దిశగా ప్రజలను చైతన్యపరచాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Related News

Latest News