అప్పులు చెల్లిస్తూనే తెలంగాణను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, నవంబర్ 10: గత ప్రభుత్వం చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత 70 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చిందని, అలాంటప్పుడు ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదని ప్రశ్నించారు. కరువు కాటకాలు, సాగునీటి సమస్యలు, ఉపాధి అవకాశాలు లేక వలసలతో ఇబ్బందులు పడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. 2028 డిసెంబర్ నాటికి కృష్ణానది జలాలతో కొడంగల్ ప్రాంతంలోని భూములను తడిపి పచ్చని పంటలు పండించేలా చేయడం తన బాధ్యతని పేర్కొన్నారు. పోలేపల్లి ఎల్లమ్మ అమ్మవారి మీద ఆన వేసి మరీ ఈ మాట చెబుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో రూ.9,053 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రైతులతో కలిసి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలమూరు జిల్లా ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది నాయకులు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని, రైతులకు సాగునీరు అందక భూములు ఆశించిన స్థాయిలో పంటలు పండించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలు గడిచినా ఆశించిన పురోగతి సాధించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా పాలమూరు పరిస్థితులు మారుతాయని ప్రజలు ఆశించారని, కానీ ఆ ఆశలకు తగిన ఫలితాలు దక్కలేదని పేర్కొన్నారు. మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని గత పదేళ్లపాటు పక్కన పెట్టారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఈ ప్రాంత రైతుల పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వానికి అవకాశం వచ్చినందున పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే, మరోవైపు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కొడంగల్ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వాటి ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

రహదారుల అభివృద్ధి కూడా కొడంగల్ ప్రాంత భవిష్యత్తును మార్చబోతోందని ముఖ్యమంత్రి చెప్పారు. రాజేంద్రనగర్ నుంచి చేవెళ్ల, షాబాద్, పరిగి మీదుగా కొడంగల్ వరకు రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచనున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు ఒకదానికొకటి అనుసంధానమై ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానిక యువతకు తమ ప్రాంతంలోనే ఉపాధి లభించేలా పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని, వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పరిస్థితులపై ప్రజలు, రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎల్‌నినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా “ప్రజాబలం” కార్యక్రమాన్ని చేపట్టి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని ప్రజలతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో సన్నబియ్యం సరఫరా గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఒక పంట కాలంలో వరి సాగు తగ్గినా లేదా వడ్లు పండకపోయినా ప్రజలకు అవసరమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కొడంగల్‌ను అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దడంతో పాటు పాలమూరు జిల్లాలో వలసలను తగ్గించి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, రవాణా రంగాల్లో కొత్త అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. 2028 డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను కొడంగల్ భూములకు అందిస్తామన్న హామీని అమలు చేయడమే తన ముందున్న ప్రధాన బాధ్యతల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే పాలమూరు ప్రాంత రూపురేఖలు మారుతాయని, రైతులకు సాగునీరు, యువతకు ఉపాధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Latest News