వెంకటయపల్లిలో కులవివక్షపై KVPS, DBF ఆగ్రహం
గ్రామకంఠం భూమి కబ్జాపై అధికారుల నిర్లక్ష్యం.
అట్రాసిటీ కేసులో నిందితుల అరెస్టుకు డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 03: మెదక్ జిల్లా తుప్రాన్ మండలం వెంకటయపల్లి గ్రామంలో పోచమ్మ గుడికి దళితులు వెళ్లకుండా దారిని మూసివేయడంపై KVPS, DBF ప్రతినిధి బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన బృందం బాధిత దళితులతో సమావేశమై ఘటన వివరాలు తెలుసుకుంది. అనంతరం ఆలయానికి వెళ్లే దారిని పరిశీలించింది.ఈ సందర్భంగా DBF జాతీయ కార్యదర్శి పి. శంకర్, KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య మాట్లాడుతూ.. దశాబ్దాలుగా శ్రావణ మాసంలో పోచమ్మ గుడికి బోనాలు తీసుకెళ్లే ఆనవాయితీ ఉందన్నారు. 2026లో బోనాలు తీసుకెళ్లేందుకు దళితులు ప్రయత్నించగా లంబ మహేష్, వెంకటేష్ ట్రాక్టర్ను అడ్డంగా పెట్టి దారిని మూసివేసి అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.గ్రామకంఠం భూమిని కొందరు ఆక్రమిస్తున్నా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సెప్టెంబర్ 10న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్టోబర్ 7న కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డీపీవో ఆదేశించినప్పటికీ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి దారిని పునరుద్ధరించకపోవడం దారుణమన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోనే దళితులపై కులవివక్ష, దాడులు కొనసాగడం విచారకరమని విమర్శించారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ, దళితులపై నిజంగా ప్రేమ ఉంటే దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తుప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు.
నవంబర్ 5న డీఎస్పీ కార్యాలయం ముట్టడి
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న కోనాయపల్లి నుంచి తుప్రాన్ డీఎస్పీ కార్యాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. అప్పటికీ పోలీసులు స్పందించకపోతే నవంబర్ 11, 12 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో DBF తుప్రాన్ డివిజన్ అధ్యక్షుడు పంచమి చంద్రం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బొడ్డు రాజు, గ్రామస్తులు కె. స్వామి, బి. శేఖర్, కె. కనకరాజు, బి. నర్సింలు, నరేష్, కిషన్, శ్రీనివాస్, నర్సయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

































