ప్రతిపక్షం, జూలై 28: పాస్‌పోర్టు ధృవీకరణ పేరుతో కొందరు పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫిర్యాదులపై నగర పోలీసులు స్పందించారు. పాస్‌పోర్టు ధృవీకరణ కోసం వచ్చిన సిబ్బంది లంచం అడుగుతున్నారని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమ వేదికగా ప్రశ్నించగా, దానికి మద్దతుగా పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు రూ.500 నుంచి రూ.4 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో నగర పోలీసులు అధికారికంగా స్పందించారు. విధి నిర్వహణలో భాగంగా ఎవరైనా పోలీసు సిబ్బంది లంచం డిమాండ్ చేసినా లేదా అనుచితంగా ప్రవర్తించినా వెంటనే 9490616555 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతూ ఆరోపణలపై విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. పాస్‌పోర్టు ధృవీకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ప్రజలు లంచాలకు పాల్పడకుండా, అలాంటి ఘటనలు ఎదురైతే ఆధారాలతో వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

















