విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు ఘన నివాళులు
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
రష్మి పెరుమాళ్, సిద్ధిపేట సీపీ
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 21: దేశ రక్షణ, ప్రజల ప్రాణ, ఆస్తుల పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసు అధికారుల సేవలను స్మరించుకుని వారి కుటుంబ సభ్యులతో కలిసి అధికారులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ పోలీసు శాఖ నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తుందని చెప్పారు. పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా 24 గంటలూ విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైన్యం దాడిలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలను, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలీసు శాఖ ఎప్పటికీ మరచిపోదని స్పష్టం చేశారు.
అమర వీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. వారి సంక్షేమానికి శాఖ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు వివరించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించి జ్ఞాపికలను అందజేశారు.
సిద్దిపేట కమిషనరేట్‌లో ఏడుగురు అమరులు
అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్ మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ఇప్పటివరకు ఏడుగురు పోలీసు అధికారులు, సిబ్బంది అమరులయ్యారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 154 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను చదివి వినిపించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని చెప్పారు. వారి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




































