- దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్
- పోలీసు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి చేయూత: ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్ డి. శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రతిపక్షం ,నవంబర్ 10: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి రూ.50 లక్షల విరాళం అందించారు. మంగళవారం మైండ్ స్పేస్ లోని పెరెల్ క్లబ్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్కు విరాళం చెక్కును అందజేశారు.
ఈ నిధులను పాఠశాలలో తరగతి గదులు, సైన్స్, టెక్నాలజీ ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా వసతులు, డిజిటల్ విద్యా సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది పిల్లలతోపాటు సాధారణ ప్రజల కుటుంబాలకు చెందిన పిల్లలకు సైతం సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్యను అందించడమే ఈ పాఠశాల లక్ష్యం.
విరాళం అందించిన డాక్టర్ శ్రీనివాసరెడ్డిని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా అభినందించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని ఆయన సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఇతర రంగాల్లోనూ మెరుగైన అవకాశాలు కల్పించేలా పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పోలీసులంటే తనకు ఎంతో గౌరవమని, సమాజ భద్రత కోసం వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో విరాళం ఇచ్చినట్లు తెలిపారు. విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, ఎస్ఎస్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ఐటీ రంగానికి చెందిన సంస్థలు, ఆర్టీసీ, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.





























