ప్రతిపక్షం, ఆగస్టు 26: తెలంగాణలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై, కంటైనర్ డీసీఎంలో ఉన్న భారీ ఇనుప రాడ్లు బస్సులోకి దూసుకెళ్లడంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఇనుప రాడ్లతో కూడిన కంటైనర్ డీసీఎంను బస్సు డ్రైవర్ ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు కుడివైపు భాగం డీసీఎంను ఢీకొట్టడంతో అందులో ఉన్న పొడవైన ఇనుప రాడ్లు బస్సులోకి దూసుకెళ్లాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని పలువురు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకురావడంతో ప్రయాణికులకు తేరుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా కుడివైపు కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రమాదం అనంతరం ఘటనాస్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. బస్సు తీవ్రంగా దెబ్బతినగా, ఇనుప రాడ్లు లోపలికి చొచ్చుకుపోయిన దృశ్యాలు భీతిగొల్పేలా కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? ఓవర్‌టేక్ సమయంలో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి వేళల్లో సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తుచేసింది.





























