ప్రతిపక్షం, ఆగస్టు 26: తెలంగాణలో కీలకమైన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
దేవాదుల పథకం ద్వారా గోదావరి నుంచి సుమారు 38 టీఎంసీల నీటిని ఎత్తిపోసి దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి వరంగల్ ప్రాంతంతో పాటు పలు జిల్లాల్లో వ్యవసాయానికి భారీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
వరంగల్, కరీంనగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీటి ప్రయోజనాలు అందనున్నాయని మంత్రి వివరించారు. నీటి లభ్యత పెరగడంతో ఆయా ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా భూసేకరణలో జాప్యం కారణంగా పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూసేకరణకు సంబంధించిన సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించి, అవసరమైన చోట అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు.





























