[t4b-ticker]

ఇల్లు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతిపక్షం, ఆగస్టు 26: ఇల్లు కొనడం జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాల్లో ఒకటి. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ సంస్థ, అనుమతులు, ఇంటి విస్తీర్ణం, అదనపు ఛార్జీలు, అప్పగించే గడువు వంటి అంశాలపై ముందుగానే స్పష్టత తీసుకోవాలని చెబుతున్నారు.

ముందుగా మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాజెక్టుకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి ఉందో లేదో నిర్ధారించుకోవాలి. బిల్డర్‌ను కేవలం మాటల ఆధారంగా నమ్మకుండా సంబంధిత అనుమతులు, ప్రాజెక్టు వివరాలను పరిశీలించడం మంచిది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను కూడా ధ్రువీకరించుకోవాలి.

ఇంటి విస్తీర్ణం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. బిల్డర్లు ప్రచారంలో ఎక్కువగా చూపించే బిల్టప్ ఏరియాను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వాస్తవంగా మనం నివసించడానికి ఉపయోగించే కార్పెట్ ఏరియా ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బిల్డప్ ఏరియా, కార్పెట్ ఏరియా మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

అదే విధంగా ప్రాజెక్టులో అందించే సౌకర్యాలు, అంటే ఎమినిటీస్‌కు సంబంధించిన ఛార్జీలు ఏమిటి, వాటికి అదనంగా ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. ఇంటి ధరతో పాటు జీఎస్టీ, పార్కింగ్, నిర్వహణ తదితర అదనపు ఖర్చులు ఉంటే వాటి వివరాలను కూడా బిల్డర్ నుంచి స్పష్టంగా తీసుకోవాలి.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే తేదీ, ఇంటిని కొనుగోలుదారుడికి అప్పగించే గడువుపై కూడా ఒప్పందంలో స్పష్టత ఉండాలి. నిర్ణయించిన తేదీలోపు ఇల్లు అప్పగించకపోతే బిల్డర్ నుంచి ఎలాంటి పరిహారం లేదా ఇతర ప్రయోజనం లభిస్తుందో ముందుగానే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటి కొనుగోలు సమయంలో పత్రాలను జాగ్రత్తగా చదివి, అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కేవలం ప్రకటనలు, హామీలను నమ్మకుండా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను చాలావరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Spread the love

Related News

Latest News