స్వెటర్లను ఎన్నిసార్లకు ఉతకాలో తెలుసా?

ప్రతిపక్షం, నవంబర్ 19: చలికాలం వచ్చిందంటే చాలామంది స్వెటర్లు, ఉన్ని దుస్తులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి అనే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. కొందరు ప్రతిరోజూ ఉతుకుతుంటే.. మరికొందరు వారాల తరబడి ఉతకకుండా అలాగే ఉపయోగిస్తుంటారు. అయితే స్వెటర్లను తరచుగా ఉతకడం వల్ల వాటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎక్కువ రోజులు ఉతకకుండా వాడితే చెమట, దుమ్ము, బ్యాక్టీరియా పేరుకుపోయి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే స్వెటర్ తయారైన వస్త్రం, దానిని ఉపయోగించే విధానం ఆధారంగా ఉతకాలని చర్మ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా స్వెటర్లను రెండు నుంచి ఐదు సార్లు ధరించిన తర్వాత ఉతకడం మంచిదని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అయితే అన్ని రకాల స్వెటర్లకు ఒకే విధమైన ఉతుకుడు పద్ధతి సరిపోదు. ముఖ్యంగా కాటన్, సిల్క్‌తో తయారైన స్వెటర్ల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రకమైన దుస్తులు చెమట, దుమ్మును త్వరగా పీల్చుకునే అవకాశం ఉండటంతో రెండు నుంచి మూడు సార్లు ధరించిన తర్వాత శుభ్రం చేయడం మంచిది. ముఖ్యంగా నేరుగా చర్మానికి తగిలే స్వెటర్లను ఎక్కువసేపు ఉతకకుండా ఉంచకూడదు.

ఇక ఉన్నితో తయారైన స్వెటర్ల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఉన్నికి సహజంగానే దుర్వాసనను తక్కువగా నిల్వ చేసుకునే లక్షణం ఉంటుంది. అందువల్ల వీటిని ప్రతిసారీ ఉతకాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా నాలుగు నుంచి ఐదు సార్లు ధరించిన తర్వాత ఉతకవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చెమట ఎక్కువగా పట్టినప్పుడు, మరకలు పడినప్పుడు లేదా దుర్వాసన వస్తున్నప్పుడు మాత్రం ముందుగానే శుభ్రం చేసుకోవాలి.

స్వెటర్లను ఉతికేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ముఖ్యంగా ఉన్ని దుస్తులను వేడి నీటితో ఉతకడం, గట్టిగా పిండడం, ఎక్కువ వేడితో ఆరబెట్టడం వల్ల వాటి ఆకారం మారిపోవచ్చు. అందుకే దుస్తులపై ఉన్న వాషింగ్ సూచనలను పరిశీలించి, తగిన పద్ధతిలో శుభ్రం చేయాలి. స్వెటర్లను ఉపయోగించిన తర్వాత గాలి తగిలే ప్రదేశంలో కొంతసేపు ఉంచడం వల్ల తేమ, చెమట వాసన తగ్గుతాయి. ఇలా వస్త్రం రకాన్ని బట్టి సరైన సమయంలో ఉతికి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే స్వెటర్లు ఎక్కువకాలం కొత్తవాటిలా ఉంటాయి. అంతేకాకుండా చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Related News

Latest News