నేటి రాజకీయ నేతలకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం .
-మంత్రి పొన్నం ప్రభాకర్*
ప్రతిపక్షం. హుస్నాబాద్. నవంబర్ 11: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు స్వర్గీయ దేశిని చిన మల్లయ్య వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జన్మించిన దేశిని చిన మల్లయ్య ఇందుర్తి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా వెట్టి చాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా, భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి దేశిని చిన మల్లయ్య అని కొనియాడారు.
ప్రజా ఉద్యమాల ద్వారా సమాజ మార్పు కోసం జీవితాంతం కృషి చేసిన దేశిని చిన మల్లయ్య గారి జీవితం నేటి రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.



























