- అవినీతికి చెక్ పెట్టేందుకు 40–50 మందితో విజిలెన్స్ కమిటీ
- కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ప్రతిపక్షం, ఆగస్టు 22: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో తొలిసారిగా యువతను భాగస్వామ్యం చేస్తూ ‘జెన్–జీ విజిలెన్స్ వాచ్డాగ్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ మైత్రి హోటల్లో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్రావు ఈ కీలక ప్రకటన చేశారు.
అవినీతిపై ప్రజలే ‘వాచ్డాగ్’
నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్ పనులు, టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా 40 నుంచి 50 మందితో ప్రత్యేక విజిలెన్స్ వాచ్డాగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని రాజేందర్రావు తెలిపారు.నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించి, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. ఏ డివిజన్లో ఏ పని మంజూరైంది? ఎంత నిధులు కేటాయించారు? టెండర్ విలువ ఎంత? పనులు ఎక్కడ జరుగుతున్నాయి? నాణ్యత ఎలా ఉంది? బిల్లులు ఎలా చెల్లించారు? వంటి అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. పేపర్లపై ఒకలా.. క్షేత్రస్థాయిలో మరోలా ఉండే పరిస్థితులకు చెక్ పెట్టడమే వాచ్డాగ్ కమిటీ లక్ష్యమని పేర్కొన్నారు.
టౌన్ ప్లానింగ్‌పై ప్రత్యేక నిఘా
కరీంనగర్ నగరంలో పెద్ద పెద్ద కాంప్లెక్సులు, వాణిజ్య భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అనుమతులపై కూడా వాచ్డాగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాజేందర్ రావు తెలిపారు. సాంక్షన్డ్ ప్లాన్, నిర్మాణం జరిగిన తీరు, అనుమతులకు విరుద్ధంగా డివియేషన్లు ఉన్నాయా? తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. “అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి అనే పరిస్థితి ఉండకూడదు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలి” అన్నారు.
నగరపాలక సంస్థలో చైన్మెన్లు, డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల ద్వారా అవినీతి వ్యవహారాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని రాజేందర్రావు పేర్కొన్నారు.ఇటీవల నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాజేందర్రావు స్పందించారు. “ప్రజలు నగరపాలక సంస్థ అధికారులతో లేదా టౌన్ ప్లానింగ్ విభాగంతో ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని రాజేందర్రావు తెలిపారు.నగరపాలక సంస్థలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యవహారాలను గుర్తించి, వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ‘క్లీనింగ్ ఆపరేషన్’ నిర్వహిస్తామని రాజేందర్రావు ప్రకటించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో గత బీఆర్ఎస్ పాలకుల కంటే ప్రస్తుతం బీజేపీ పాలకుల హయాంలో అవినీతి వ్యవహారాలు మరింత పెరిగినట్లు తమకు సమాచారం వస్తోందని రాజేందర్రావు ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాజేందర్రావు తెలిపారు.మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రాజేందర్రావు తప్పుబట్టారు.కరీంనగర్లో 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాజేందర్రావు తెలిపారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాలకు సంబంధించి దాదాపు 140 సర్వే నంబర్లలో సుమారు వెయ్యి ఎకరాల వరకు భూములు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లు బాధితులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లాయని రాజేందర్రావు ఆరోపించారు.కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతిని అరికట్టేందుకు యువత, ఆర్టీఐ కార్యకర్తలు, న్యాయవాదులు, ఐటీ నిపుణులను కలుపుకొని ‘జెన్–జీ వాచ్డాగ్’ ఏర్పాటు చేస్తామన్న వెలిచాల రాజేందర్రావు ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రజలు ఫిర్యాదు చేయడం మాత్రమే కాదు.. ప్రజల తరఫున వ్యవస్థను పరిశీలించే ఒక పౌర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఈ కొత్త కాన్సెప్ట్ లక్ష్యం అని రాజేందర్రావు పేర్కొన్నారు.“అవినీతిని ప్రశ్నించే గొంతుకకు భయపడాల్సిన అవసరం లేదు.. అవినీతి చేసే వారే భయపడాలి. కరీంనగర్‌ను పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పలువురు పాల్గొన్నారు.




























