ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, క్రీడలు, సాంకేతిక రంగాల అభివృద్ధికి మరో కీలక భాగస్వామ్యానికి అడుగులు పడుతున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రతినిధులు సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్‌తో పాటు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణతో కలిసి పనిచేసే అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రత్యేకంగా జీవశాస్త్ర ఆధారిత పరిశ్రమలు, క్రీడలు, సాంకేతికత, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుపై లివర్‌పూల్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న సాంకేతిక, పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ఈ భాగస్వామ్యంతో అనుసంధానించే అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
తెలంగాణతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా చర్చించి, ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది.
లివర్‌పూల్‌తో ప్రతిపాదిత భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణలో క్రీడా రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు సాంకేతిక, జీవశాస్త్ర ఆధారిత పరిశ్రమలు, సృజనాత్మక రంగాల్లో అంతర్జాతీయ సహకారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


























