ప్రతిపక్షం, జూలై 31: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. Gen Z యువతను బెదిరించి మౌనంగా ఉంచడం ఎవరి వల్లా కాదని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హెచ్చరికలు చేశారు.
సోషల్ మీడియాలో స్పందించిన రాహుల్ గాంధీ, “మొదట విద్యార్థుల ఎముకలు విరగ్గొట్టారు.. ఇప్పుడు వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.. సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు. మీరు భారతదేశపు గతం మాత్రమే. దేశ భవిష్యత్తు విషయంలో జాగ్రత్తగా ఉండండి. Gen Zని భయపెట్టి ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. విద్యార్థులపై బలప్రయోగానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో వెల్లడించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనలను అణిచివేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ కోరింది. మరోవైపు, ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

















