ప్రతిపక్షం, జూలై 31, వరంగల్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన ఆయన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని గ్రామాల స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సుదర్శన్ రెడ్డి, ఉద్యమ కాలంలో పార్టీ బలోపేతానికి, సబ్బండ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయడం వల్ల ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజాసేవ ప్రారంభించిన ఆయన, అనంతరం తెలంగాణ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు సంపాదించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న సుదర్శన్ రెడ్డి, తన సరళ జీవనం, నిజాయితీ, ఉద్యమ స్ఫూర్తితో ఎంతోమంది యువ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
ఆయన మరణంతో తెలంగాణ ఉద్యమం ఓ కీలక నాయకుడిని, వరంగల్ జిల్లా ప్రజలు తమకు అండగా నిలిచిన ప్రజానాయకుడిని కోల్పోయారని పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వారు పేర్కొంటున్నారు.

















