ప్రతిపక్షం, ఆగస్టు 10: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు నేటితో గడువు ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయని ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 73.95 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోకపోగా.. మరికొందరు ఫారాలు తీసుకున్నప్పటికీ వాటిని సమర్పించలేదని తెలుస్తోంది. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి కాకపోతే వారి పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉండే విషయంలో అనిశ్చితి నెలకొంది.
ఎన్యూమరేషన్ పూర్తికాకపోవడంతో రాష్ట్ర ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎన్నికల సంఘం తదుపరి దశలో అభ్యంతరాలు, దరఖాస్తులకు అవకాశం కల్పించనుంది.
ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా
ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత సుమారు నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించనున్నారు. జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు ఈ దశలో తమ వివరాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు ఎన్యూమరేషన్ పూర్తి చేయని అర్హులైన ఓటర్లు వీలైనంత త్వరగా సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతారా? లేక నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే తదుపరి ప్రక్రియ కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





























