ప్రతిపక్షం, ఆగస్టు 02: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా నేడు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార నివాస గృహ సముదాయంలో బోనాల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోనాల విందులో ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.
మంత్రి అధికార నివాసంలోని మినిస్టర్ క్వార్టర్స్ ప్రాంగణాన్ని బోనాల ఉత్సవాల కోసం సాంప్రదాయ అలంకరణలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. భక్తులకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రత, పార్కింగ్, రాకపోకలు, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ బోనాల ఉత్సవాలు భక్తి, సంప్రదాయం, సోదరభావానికి ప్రతీకగా నిలవనున్నాయి.



















