[t4b-ticker]

తెలంగాణలో ఒంటరిగానే పోటీ.. జనసేనతో సహా ఎవరితోనూ పొత్తు లేదు: రాంచందర్ రావు

ప్రతిపక్షం, ఆగస్టు 07: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏ రాజకీయ పార్టీతోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని వెల్లడించారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన, తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు.

పార్టీలో అంతర్గత విభేదాలపై వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ, నేతల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని, అవి పార్టీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపవని రాంచందర్ రావు పేర్కొన్నారు.

అయితే, జనసేన జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ, తెలంగాణ రాజకీయాల్లో మాత్రం బీజేపీ ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటుందని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News