[t4b-ticker]

మూసీ రివర్‌ఫ్రంట్‌కు హైకోర్టు బ్రేక్‌..

ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు పేరుతో హిమాయత్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టే అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక లేకుండానే భూములను ఎలా సేకరిస్తారని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పిటిషనర్ల భూముల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధిలో భాగంగా హిమాయత్‌సాగర్‌ సమీపంలోని భూములను సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూములను ప్రాజెక్టు కోసం తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక లేకుండానే భూసేకరణకు చర్యలు చేపడుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం కాకముందే భూముల సేకరణకు ఎలా ముందుకు వెళ్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భూసేకరణ ప్రక్రియలో నిబంధనలు, చట్టపరమైన విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వివేక్‌రెడ్డి, ప్రతీక్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. భూముల యజమానుల హక్కులను పరిరక్షించాలని, ప్రాజెక్టు పేరుతో తమ ఆస్తులపై అధికారులు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పిటిషనర్ల భూముల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్న బాధితులకు తాత్కాలికంగా ఊరట లభించింది. భూసేకరణకు సంబంధించిన తదుపరి చర్యలపై కోర్టు ఇచ్చే ఉత్తర్వులు కీలకంగా మారనున్నాయి.

Spread the love

Related News

Latest News