కార్తీక మాసంలో పెళ్లిళ్ల సందడి.. కళకళలాడుతున్న జగిత్యాల జిల్లా

ప్రతిపక్షం, నవంబర్ 17: కార్తీక మాసం ప్రారంభం కావడంతో జగిత్యాల జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. జిల్లావ్యాప్తంగా వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉండటంతో వందల సంఖ్యలో జంటలు త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో పెళ్లి ఇళ్లలో హడావుడి నెలకొంది. యువతీ యువకుల తల్లిదండ్రులు వివాహ ఏర్పాట్లలో బిజీగా మారారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల షాపులు, ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌ కేంద్రాలు తదితర వ్యాపార సంస్థల్లో రద్దీ పెరుగుతోంది.

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, సేవలను ముందుగానే సిద్ధం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల్లోని కల్యాణ మండపాలను ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నారు. పెళ్లి తేదీలు ఖరారు కావడంతో పురోహితులు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, భాజా భజంత్రీల బృందాలు, ఆర్కెస్ట్రా నిర్వాహకులు, డెకరేషన్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కూడా ముందుగానే పనులు అప్పగిస్తున్నారు.

జిల్లాలో సుమారు 150 ఫంక్షన్‌ హాళ్లు, 300 వరకు కమ్యూనిటీ హాళ్లు అందుబాటులో ఉండగా, పలు దేవాలయాల్లోనూ వివాహ మండపాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. వివాహ వేడుకలకు అవసరమైన పట్టు వస్త్రాలు, ఇతర దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు కూడా ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో వస్త్ర, బంగారు ఆభరణాల వ్యాపారం ఎక్కువగా సాగుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు దుకాణదారులు కొత్త డిజైన్లతో కూడిన వస్త్రాలు, ఆభరణాలను అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని దుకాణాలు ప్రత్యేక తగ్గింపులు, బహుమతులు కూడా అందిస్తున్నాయి.

బంగారం ధరలు ఇటీవల కొంత తగ్గడం పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాలకు కొంత ఊరటనిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గినప్పటికీ పెళ్లి నిర్వహణ ఖర్చులు మాత్రం తగ్గడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్‌ హాళ్ల అద్దెలు, క్యాటరింగ్‌, అలంకరణ, వస్త్రాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో వివాహ ఖర్చులు భారంగా మారుతున్నాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు చెబుతున్నాయి. సాధారణంగా పెళ్లి నిర్వహించాలన్నా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా జిల్లాలోని పలు వ్యాపార రంగాలకు మంచి ఊపునిచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. షాపింగ్‌ మాల్స్‌, వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ షాపులు, ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌ కేంద్రాలు, పూల అలంకరణ సంస్థలు, వంట మాస్టర్లకు చేతినిండా పని లభించనుంది. వివాహాల సీజన్‌లో జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పెళ్లిళ్ల సందడి కుటుంబాలకే పరిమితం కాకుండా స్థానిక ఆర్థిక కార్యకలాపాలపైనా ప్రభావం చూపనుంది.

కార్తీక మాసంతో పాటు మార్గశిర మాసంలోనూ వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబర్‌లో 12 నుంచి 15వ తేదీ వరకు, 18 నుంచి 22వ తేదీ వరకు, 24 నుంచి 26వ తేదీ వరకు వివాహ ముహూర్తాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్‌లో 2 నుంచి 4వ తేదీ వరకు, 10 నుంచి 13వ తేదీ వరకు, 15 నుంచి 19వ తేదీ వరకు, 22, 23 తేదీల్లో, 27 నుంచి 31వ తేదీ వరకు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని వివరించారు. వరుసగా శుభ ముహూర్తాలు ఉండటంతో రాబోయే రెండు నెలల పాటు జగిత్యాల జిల్లాలో పెళ్లిళ్ల సందడి కొనసాగనుంది.

Related News

Latest News