ప్రతిపక్షం, నవంబర్ 03: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకోవాలనుకునే పట్టభద్రులకు ఎన్నికల సంఘం కీలక వెసులుబాటు కల్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఫామ్-18 ద్వారా ఓటరు నమోదుకు నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ పట్టభద్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
గత రెండు రోజులుగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ సాంకేతిక సమస్యలతో సరిగా పనిచేయకపోవడంతో పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోర్టల్ మొరాయించడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ సమస్యపై స్పందించిన సీఈవో సుదర్శన్ రెడ్డి సాంకేతిక లోపాలను సరిచేసి ఆన్లైన్ సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పట్టభద్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ఓటు నమోదు ప్రక్రియకు తగిన అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు.
మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్ల దాఖలు, పోలింగ్ తదితర ప్రక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటు హక్కు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.



























