ప్రతిపక్షం, అక్టోబర్ 08: ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేతల పాత ఫొటోను సామాజిక మాధ్యమ వేదికగా పంచుకుంటూ ఆ పార్టీపై విమర్శలు చేసింది. 1991 మే 20న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫొటోను బీజేపీ తన పోస్టులో ప్రస్తావించింది.
ఆ ఫొటోలో అప్పటి ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు రాజేశ్ ఖన్నా, రాజీవ్ గాంధీ సమక్షంలో సోనియా గాంధీ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్న దృశ్యం ఉందని బీజేపీ పేర్కొంది. ఈ ఫొటోను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ నేతలు గతంలో ఉన్న బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని తిరిగి కోరుకుంటున్నారంటూ వ్యంగ్యంగా స్పందించింది.
‘‘ఓహో.. రాహుల్ గాంధీ, ఆయన వర్గం ఆ స్వర్ణయుగాన్ని మిస్ అవుతున్నట్టుంది. గోప్యతకు అవకాశం లేని అలాంటి ఎన్నికలే కాంగ్రెస్‌కు కావాలి. అందుకే ఓట్ల చోరీ అంటూ నిరసనలు చేస్తోంది’’ అని బీజేపీ విమర్శించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ తాజా స్పందన చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కులు, ఓటింగ్ విధానంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే రాజకీయ చర్చ కొనసాగుతోంది.
బ్యాలెట్ పద్ధతిని కోరుతూ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాత ఎన్నికల సందర్భాలను ప్రస్తావించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరు పార్టీల నేతలు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.





























