రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

ప్రతిపక్షం, నవంబర్ 22: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును భక్తులతో ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

కోటా–ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై శంభుపుర గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సికార్ జిల్లాలోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం భక్తులు మహారాష్ట్రకు తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మార్గమధ్యంలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వారు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురికి కోటా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ప్రమాదంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Latest News