ప్రతిపక్షం, నవంబర్ 17: తెలంగాణలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలల తరబడి పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. ఈ నెల నవంబర్ 19వ తేదీ నుంచి కొత్త పింఛన్ల డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల చొప్పున పింఛన్ అందనుంది. కొత్తగా అర్హత పొందిన సుమారు 4.63 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో పాటు అవసరమైన నిధులను విడుదల చేసినట్లు సమాచారం.
నవంబర్ 19న తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఇందిరమ్మ బీమా పథకాన్ని సిద్దిపేటలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అదే రోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి కూడా అదే రోజు నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పింఛన్ మొత్తాలను పోస్టాఫీసుల ద్వారా అందించేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రతి నెలా పింఛన్ సొమ్ము నేరుగా ఖాతాల్లోకి చేరుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికుల విభాగాల్లో అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన వారిని గుర్తించారు. ఈ పరిశీలన అనంతరం మొత్తం 4,63,857 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడైంది. వీరిలో వితంతు పింఛన్లకు 2,77,894 మంది, దివ్యాంగుల పింఛన్లకు 1,00,224 మంది అర్హత సాధించారు. ఒంటరి మహిళల విభాగంలో 53,844 మందిని, గీత కార్మికుల విభాగంలో 27,444 మందిని, చేనేత కార్మికుల విభాగంలో 4,451 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
కొత్తగా పింఛన్లు మంజూరైన వారితో కలిపి తెలంగాణలో మొత్తం పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య సుమారు 45 లక్షలకు చేరుకోనుంది. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి నెలకు రూ.2 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. కొత్తగా ఎంపికైన వారికి కూడా ఈ నెల నుంచే పింఛన్ అందనుంది. ఇందుకోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులను విడుదల చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, భవిష్యత్తులో పింఛన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచే అంశంపై కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పెంపునకు సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కొత్తగా పింఛన్లు మంజూరైన 4.63 లక్షల మందికి నవంబర్ 19 నుంచి నగదు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



























