కొనుగోలు కేంద్రాలకు సరిపడా గోనె సంచులు అందివ్వాలి
లారీలు, మిల్లుల కేటాయింపులో జాప్యం నివారించాలి
నంగునూరు మండలంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 11: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దేవులపల్లి యాదగిరి, పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సకాలంలో కొనుగోలు చేయాలన్నారు. రవాణా ప్రక్రియలో జాప్యం జరగకుండా అధికారులు, కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నంగునూరు మండలంలోని నాగరాజుపల్లి, కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, నర్మెట్ట, మైసంపల్లి, ఖానాపూర్, మగ్దూంపూర్ గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నాగరాజుపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా చూడాలని పేర్కొన్నారు. పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులతో మాట్లాడి అన్ని కొనుగోలు కేంద్రాలకు బుధవారమే గోనె సంచులు పంపించాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోళ్లలో కొంత జాప్యం జరిగినందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురువారం లోగా ధాన్యం దిగుమతి చేసుకునే మిల్లులను అన్ని కేంద్రాలకు కేటాయించాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీ సంఘం ప్రతినిధులతో మాట్లాడి, కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్న ధాన్యం వివరాలను నమోదు చేసి, రైతులకు ప్రాధాన్యత క్రమంలో తూకం వేసేలా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు చెప్పారు. రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ముక్కెర లింగం, శనివారం స్వాతి బాబు, మాజీ ఎంపీటీసీ కూతురు రాజిరెడ్డి, ఉపసర్పంచ్ చేర్యాల రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు చొప్పరి శిరీష, శ్రీకాంత్ రెడ్డి, రైతులు జక్కిరెడ్డి మల్లారెడ్డి, ఆడెపు శంకరయ్య, ఎర్రవెల్లి కనకరెడ్డి, శనిగరం అయిలయ్య, దుబ్బుడు శ్రీకాంత్ రెడ్డి, పాకాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంచాలకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సంచాలకులు, సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.































