జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ, వాహన పూజలు.

*జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరుపున విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 19: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజలు, ఎం.టి. విభాగంలో వాహన పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

*చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి: ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ విజయపథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సోదరభావంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

*ఆయుధ పూజలు…

అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ నిర్వహించి, విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఆయుధాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శక్తికి, ధైర్యానికి, విజయానికి ప్రతీకగా నిలిచే దుర్గామాతను ప్రార్థిస్తూ, పోలీస్ సిబ్బంది ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

*వాహన పూజలు…
అదేవిధంగా ఎం.టి. విభాగంలో పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సమయాల్లో సత్వర సేవలు అందించడంలో పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.విజయదశమి పండుగ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సుఖసంతోషాలు, ఆరోగ్యం, విజయాలను అందించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో నల్లగొండ జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ నాగరాజు, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, నరసింహ, సురప్ప నాయుడు, హరిబాబు, కళ్యాణ్ రాజ్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News