విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 26: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, అంతర్గత ప్రతిభను వెలికితీయడంలో బాలల వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహద పడతాయని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సత్యాన్ని అన్వేషించడమే సైన్స్ అని, విద్యార్థులు తార్కిక ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు ప్రతి విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇన్స్పైర్, బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్థులను ఆయా ప్రాజెక్టుల పనితీరు, వాటి ఉపయోగాలు, వాటి రూపకల్పన వెనుక ఉన్న ఆలోచనల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో సైన్స్ ప్రాధాన్యం ఎంతో కీలకమని, నిత్యజీవితంలో సైన్స్ లేనిదే మనిషి జీవితం లేదని పేర్కొన్నారు. సైన్స్ నిరంతరం కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతుందని చెప్పారు. మానవ జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. విద్యార్థులు పుస్తకాల్లోని విషయాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని చెప్పారు. తమ చుట్టూ జరిగే పరిణామాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అపారమైన ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారిలోనే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు రూపుదిద్దుకుంటారని అన్నారు. విద్యార్థుల్లోని సహజ ఆసక్తిని గుర్తించి, వారిని సరైన మార్గంలో నడిపించి, నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, ప్రోత్సాహం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీకి విద్యాశాఖ అధికారుల స్వాగతం
కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి విద్యాశాఖ తరఫున ఏడి శాస్త్రి, జిల్లా సైన్స్ అధికారి రాజమౌళి, సెక్టోరియల్ అధికారులు రామస్వామి, నర్సింలు, నర్మద స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భట్టాపురం మధుసూదన్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర శర్మ, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సురేందర్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీఎన్ రెడ్డి, పార్థసారథి, పంజా రాజమల్లు, వంగ శ్రీనివాస రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





























